శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. మనుజుల తమసౌఖ్యము కొఱ
కును సంరక్షణము నవనిఁ గోరుదు, రొగి నే
జనపాలుఁడు సంరక్షిం
పను దగియును బ్రోవఁ డతఁడె పాపి కుమారా!
71
క. మండలపతి దండార్హుల
దండింపక యుండరాదు ధారుణి నతఁడా
ఖండల సమానుఁడైనను
మెండగు పాపంబునొంది మెలఁగుఁ గుమారా!
72
క. గరళముఁ బెట్టెడు వాని
న్బరుఁ జంపఁదలంచు వానిఁ జనులెల్ల బయ
ల్పఱచెడి వానిం జనధన
హరుని నృపతిం జంపి పుణ్యుఁ డగును గుమారా!
73
క. గృహదాహకునిం బరదా
రహరుం బంధుహితకార్య రహితుని దుష్టో
త్సహపరుని జంపి నరపతి
యిహపరములయందు గీర్తి నెనయుఁ గుమారా!
74
క. సత్తువగల యాతని పై
నెత్తిన దుర్బలుఁడు తస్కరించిన నతండున్‌
విత్తముఁ గోల్పడు నతఁడును
జిత్తజ పీడితుఁడు జింతఁ జెందుఁ గుమారా!
75
క. కత్తిని చేతంబట్టుచు
మొత్తఁదలఁచి వచ్చువాని ముఖ్యముగా మే
ల్హత్తించిన నదె ప్రాయ
శ్చిత్త మతనిఁ జంపఁదగదు చిన్ని కుమారా!
76
క. ఓరిమియె కలిగియుండిన
వారలఁ గని ప్రజ్ఞలేని వా రనియెద, రౌ
నారయ సత్పురుషాళికి
నోరిమియే భూషణంబు రోరి కుమారా!
77
క. పురుషుం డొనర్పని పనికి
నరయఁగ దైవం బదెట్టు లనుకూలించున్‌
సరణిగ విత్తకయున్నను
వరిపండునె ధరణిలోన వఱలి కుమారా!
78
క. తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధి బొందు, జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైనఁ బెరఁగు నయ్య కుమారా!
79
క. చమురింకిపోయినను దీ
పము శమియించిన విధంబు పౌరుషము విహీ
నమె యగును, దైవ మనుకూ
లము గాకుండినను భూతలమునఁ గుమారా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )