శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. అల దేవగృహము కడ పయి
రుల గోవాటములయందుఁ ద్రోవలలో ర
చ్చల కొట్టములను నొప్పదు
మలమూత్ర విసర్జనంబు మహిని గుమారా!
41
క. తనుజులను గురుల వృద్ధుల
జననీ జనకులను సాధు జనుల నెఁవడు దా
ఘనుఁడయ్యుఁ బ్రోవఁడో యా
జనుఁడే జీవన్మృతుండు జగతిఁ గుమారా!
42
క. ధీరుఁడు తనదగు సంపద
జారినయెడఁ జింత నొందఁజాలక తా ల
క్ష్మీరమణుని వరచరణాం
భోరుహములు గొలిచి ముక్తిఁ బొందుఁ గుమారా!
43
క. పాపపుఁబని మదిఁ దలఁపకు,
చేపట్టినవారి విడువఁ జేయకు, కీడున్‌
లోపలఁ దలఁపకు, క్రూరుల
ప్రాపును మది నమ్మఁబోకు రహిని గుమారా!
44
క. జగడంబు లాడుచోటను
మగువలు వసియించుచోట మదగజము దరిన్‌
బగతుండు తిరుగుచోటన్‌
మగిడి చనఁగవలయుఁ జలము మాని గుమారా!
45
క. దుర్జనుల నైనఁ దిట్టకు
వర్జింపకు సుజనగోష్ఠి, పరులను నెల్లన్‌
నిర్జింతు ననుచుఁ ద్రుళ్ళకు,
దుర్జనుఁడండ్రు నిను నిందఁ దోఁపఁ గుమారా!
46
క. తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతర స్థలాదుల కొంటిన్‌
జరుగకు శత్రులమ్రోల
న్మరువకు మేల్‌ హితులయెడల మదిని గుమారా!
47
క. తరళాక్షుల యెడ నెన్నఁడుఁ
బరిహాసాలాపములను బచరింపకుమీ
పరికించి నిరీక్షించిన
నురుదోషం బనుచుఁ దలఁపుచుండు కుమారా!
48
క. సంపద గలవారిని మో
దింపుచుఁ జుట్టుకొనియుందు రెల్లప్పుడు స
త్సంపద తొలంగిన నుపే
క్షింపుదు రవివేకజనులు క్షితిని గుమారా!
49
క. కాయమున నాటు శరము లు
పాయంబునఁ దీయవచ్చు బహు నిష్ఠురతన్‌
గూయ మది నాటుమాటలు
పాయవుగా యెపుడు వెగడు పరచుఁ గుమారా!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )