శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. తన పంక్తియందు బాంధవ
జనము లొక విధంబుగ మెసంగుచు నుండం
గను దా సద్రసముల మెసఁ
గిన విషభోజనసమంబు క్షితిని గుమారా!
61
క. పెరవారలుండ ఫలముల
నరయంగా వారికిడక యాతఁడె మెసవన్‌
సరిగాదు, విసపుమేఁతకు
సరియౌనని తలఁపు మానసమునఁ గుమారా!
62
క. గుణవంతుని సంగతి ని
ర్గుణులకు గుణములు ఘటించు, గుసుమాది సమ
ర్పణమున వస్త్రాదిక మా
క్షణమునఁ పరిమళము నొందు కరణిఁ గుమారా!
63
క. మును స్నానము సేయక చం
దన మలఁదుట యనుచితం బుదకయుత వస్త్రం
బును విదలించుట కూడదు,
మనమున నివి తెలిసి మనుము మహిని గుమారా!
64
క. పరజనులు కట్టి విడిచిన
వరచేలములైనఁ గట్ట వలదు, వలువన్‌
నెఱిమాయు మడత మార్చుచు
ధరియించుట యొప్పదండ్రు ధరను గుమారా!
65
క. మును మనుజుఁడు జన్మాంతర
మునఁజేసిన పుణ్యపాపములు పుడమిని వా
నిని బొందక విడువవు, దే
వుని నిందింపకుము కీడు వొడముఁ గుమారా!
66
క. అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రు విద్య రాని యతని సం
స్తవనీయు దేవు శ్రుతులన్‌
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!
67
క. లోకమున సర్వజనులకు
నా కాలుఁడు ప్రాణహారి యై యుండఁగ శో
భాకృతకార్యముల వడిం
బ్రాకటముగఁ జేయకుండ రాదు కుమారా!
68
క. అల సరస్నానంబులఁ బరి
మళముం గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనముల నుబ్బకు,
కలుగుం జనుఁ గాలవశము గాను గుమారా!
69
క. ప్రజ్ఞావంతుని చేతను
బ్రజ్ఞాహీనునకుఁ గడమ వాటిల్లు నిలన్‌
బ్రాజ్ఞతగల్గి నటించినఁ
దజ్ఞులు నుతియింతు రదియె ధనము కుమారా!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )