| శతకములు | కుమార శతకము |
|
| క. |
వగవకు గడిచిన దానికిఁ బొగడకు దుర్మతుల నెపుడు, పొసగని పనికై యొగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను గుమారా! |
31 |
| క. |
పనిఁబూని జనులు సంతత మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం చిన యశము నొందుచుందురు గనుగొను మిదె దొడ్డనడక గాఁగ కుమారా! |
32 |
| క. |
విను లోకంబున ధర్మం బఁనగఁ గులాచార మట్ల నరసి నడువ! దాఁ గను నాయుఃకీర్తుల నిహ మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా! |
33 |
| క. |
సరివారిలోన నేర్పునఁ దిరిగెడు వారలకుఁగాక తెరువాటులలో నరయుచు మెలఁగెడి వారికిఁ బరువేటికిఁగీడె యనుభవంబు గుమారా! |
34 |
| క. |
ఒరు లెవ్వరేని దనతోఁ బరిభాషించినను మేలు పలుకవలయు సా దరము గల చోటఁ గీడు న్గరము నొనర్పంగరాదు గదర! కుమారా! |
35 |
| క. |
సిరి చేర్చు బంధువుల నా సిరియే శుభముల నొసంగు చెలువులఁ గూర్చున్ సిరియే గుణవంతుండని ధరలోఁబొగడించునంచుఁ దలఁపు కుమారా! |
36 |
| క. |
ఆకులతఁబడకు మాపద, నేకతమునఁ జనకు త్రోవ, నింతికిఁదగు నం తే కాని చన వొసంగకు, లోకులు నిన్నెన్న సుగుణ లోల! కుమారా! |
37 |
| క. |
తనదు కులాంగన యాలో చనమున మంత్రియును భుక్తి సమయంబునఁ దా జననియు రతిలో రంభా వనజేక్షణ యయినఁ బుణ్య వశము కుమారా! |
38 |
| క. |
మనుజుఁడు సభ్యుఁడు దానై గనియున్న యధార్థమెల్ల గానని యట్లా మనుజుండు పలుకకున్నను ఘనమగు పాతకము నాఁడు గనును గుమారా! |
39 |
| క. |
అంగీకార రహిత మగు సంగతికి బోవరాదు సామాన్యులతో డం గడు జగడమునకుఁ జన వెంగలితనమండ్రు వినుము కుమారా! |
40 |