శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. ధరణీజాతము లే యే
తరి నెట్లెట్లను ఫలించుఁ దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవముఁ
గరమనుభవనీయ మగును గాదె? కుమారా!
51
క. పెను కోపము గర్వము ను
బ్బును జలతయు దురభిమానమును వ్యాపారం
బునఁ జొరక యునికియును న
ల్పుని గుణము లటంచుఁ దెలివిఁ బొందు కుమారా!
52
క. విత్తముఁ గూర్చిన మనుజుం
డుత్తమ దానంబు భోగ మొందని యెడ భూ
భృత్తస్కర శిఖిగతము ని
వృత్తి కరంబగును నట్టి పదవి కుమారా!
53
క. సద్గోష్ఠి సిరియు నొసఁగును
సద్గోష్ఠియె కీర్తిఁబెంచు సంతుష్ఠిని నా
సద్గోష్ఠియె యొనఁగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపుఁ గుమారా!
54
క. ఘనులు విని సమ్మతింపని
పనులకుఁ జొరఁబడక పొగడు పనులకు జొరు, మెం
దును బొంకఁబోక స
జ్జనములతోఁ గలసిమెలఁగు జగతిఁ గుమారా!
55
క. జారులతోఁ జోరులతోఁ
గ్రూరులతో నెపుడు పొత్తుఁ గోరక మది స
త్పూరుష పదాంబుజాతా
ధారుఁడవై బ్రతుకు, కీర్తి తనరఁ గుమారా!
56
క. జ్ఞానుల చరితము వీనుల
నానుచు సత్పురుషగోష్ఠి ననఘం బనుచున్‌
బూనుము, ధర్మపథంబును
దానెఱిఁగిన యంత మఱవఁ దగదు కుమారా!
57
క. రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ,
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోఁపఁ గుమారా!
58
క. ధనవంతులైన బహు స
జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు
న్నను సతి జనకుని గృహమం
దున నుండుట తగదు కీర్తి తొలఁగుఁ గుమారా!
59
క. సభలోపల నవ్వినయెడ
సభకులు నిరసింతు రెట్టి జనుని, న్నెఱి నీ
కభయం బొసంగె నేనియుఁ
బ్రభు కరుణము నమ్మి గర్వ పడకు కుమారా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )