| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| ఉ. |
శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱు\న్ జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ మూసినముత్యమై యురము ముంగిటఁ జెంగట వేంకటేశ్వరా! |
1 |
| ఉ. |
కన్నులుగల్గి కొమ్మ నిను గప్పముఁ జేకొన లేఁతనవ్వు నీ కెన్నఁడు మోవి నిచ్చినదో యేగతి మెచ్చితో యెట్టులుండెనో యన్నిట, నేనెజాణ నని యుందువు శ్రీయలమేలుమంగకే మన్నన నెట్టు లిచ్చితివో మాటలఁ జిక్కవు వేంకటేశ్వరా! |
2 |
| చ. |
కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ పలుకులతేనెలన్ విభునిఁ బట్టముఁ గట్టితి నీదుకౌఁగిట\న్ వలదని చెప్పినన్ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా! |
3 |
| ఉ. |
నీవును దాను గూడెఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నా నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేఁడు నీ వావలిమోము చేసి తన యప్పటినుండియుఁ బల్కవిట్టులా దేవర చిత్తమెవ్వరికిఁ దేర్పఁగ శక్యమె వేంకటేశ్వరా! |
4 |
| ఉ. |
ఓలలితాంగి! యోకలికి! యోయెలజవ్వని! యోవధూటి! యో గోల! మెఱుంగుఁజూపుకనుఁగోనల నోయలమేలుమంగ మ మ్మేలినతల్లి నీవిభున కించుక మాదెసఁ జూపు మంచు నీ పాలికిఁ జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా! |
5 |
| చ. |
చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా ధికునియురంబుపై రతులఁ దేలుచు శ్రీయలమేలుమంగ నీ లికుచకుచ ప్రభావమున లేఁతవయస్సున నింత నేతురా వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా! |
6 |
| చ. |
ఒకమఱి నీవు కన్గొనల నొయ్యనఁ జూచిన నీవిభుండు లోఁ గకవికఁ దర్చుఁ జేరునట కౌఁగిటి కోయలమేలుమంగ నీ వికచవిలాస మంచు నరవిందమరందపుఁ దేనెపల్కులన్ బికశుకపంక్తి నీకుఁ దలఁపించును నీసతి వేంకటేశ్వరా! |
7 |
| ఉ. |
కూరిమి సానవట్టిన చకోరపుఁ గన్నుఁగొన\న్ దళుక్కునన్ జేరువ మించులై మెఱయఁ జిమ్ములబొమ్మలఁ బంపు నవ్వు దై వారఁగఁ గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ సారపు నేర్పుఁ జక్కగొనెఁ జక్కని మోమున వేంకటేశ్వరా! |
8 |
| ఉ. |
ఆయలసంబు లానడపు లాకనుఁగ్రేవల ముద్దుచూపు లా యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీ కలమేలుమంగ నీ మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేఁతలొ చెప్పు మంచు లేఁ బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా! |
9 |
| ఉ. |
కిన్నెర మీటి పులకించి తలంచి మనోజలీలఁ దా నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యనఁ జెప్పఁగబూనుఁ జెప్పరా కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ వన్నెలసేఁత లెట్టివో సువాళము లెట్టివో వేంకటేశ్వరా! |
10 |