| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| ఉ. |
కానిక లిచ్చె నీవిభుఁడు కౌఁగిటఁ బాన్పునఁ గమ్మవల్పుపూఁ దేనెల ఘర్మబిందువుల దేహమునం దలమేలుమంగ నీ వానగుమోముతో విభుని కంచుఁదలిర్చినఁ గాని తన్మయం బైనను బాయ దంచుఁ జెలు లందురు నీసతి వేంకటేశ్వరా! |
51 |
| చ. |
పెనఁగకుమమ్మ! చిమ్ము జళిపించిన చూపుల గర్వరేఖ రాఁ జెనకకు మమ్మ! లేఁ జెమటచెక్కుల నోయలమేలుమంగ నీ ఘనుఁడు కళావినోది రతికాంత విలాససహస్రమూర్తి వ ద్దని పొలయల్క దీర్తురు లతాంగులు నీసతి వేంకటేశ్వరా! |
52 |
| చ. |
కులుకకుమమ్మ చిమ్మజిలుకుం గొనచూపుల బిత్తరంబుగా నులుచకుమమ్మ బొమ్మముడి నూల్కొనఁగోపము లేఁతనవ్వు గా సొలయకుమమ్మ కలి నునుసోఁగల నోయలమేలుమంగ నీ చెలువున నంచు నెచ్చెలులు చేర్తురు నీసతి వేంకటేశ్వరా! |
53 |
| ఉ. |
చాఁగు బళా జగత్పతికి జాఁగు బళా జగదేకమాతకున్ చాఁగు బళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగకు\న్ జాఁగు బళా యటంచుఁ గడుఁ జక్కని కాంతను వీథివీథిమీ రేఁగఁగ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా! |
54 |
| చ. |
చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుఁగ నీకరుణాకటాక్ష మె ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి! యోయలమేలుమంగ నీ మచ్చిక నంచు నీతరుణి మన్నన నే నినుఁ గంటి నీకు నా బచ్చెనమాట లేమిటికిఁ బ్రాఁ తిదె చూడఁగ వేంకటేశ్వరా! |
55 |
| ఉ. |
ఎచ్చరికమ్ము పాదములు నిందిరసింధురయాన తమ్మిపూ నెచ్చెలి క్రొత్తక్రొత్తపలునిగ్గులతో నలమేలుమంగ నీ వచ్చిన దాఁక నీవిభుఁడు వంచిన మోమును నెత్తఁడంచు నీ మచ్చిక యింతి నింతులు మమత్త్వము నెంతురు వేంకటేశ్వరా! |
56 |
| చ. |
కనకపుఁబీఠి నెక్కి రతికాంతశరాకృతి నీవు వీథులం జనునెడ నీదు చెంగటఁ బ్రసన్నతతో నలమేలుమంగ కాం చననవకింకిణీరవము సన్నపుఁదాళగతి\న్ రచింపఁగాఁ గనుఁగవ మోడ్చి మోడ్చి రతిఁ గౌఁగిటఁ జేర్తువు వేంకటేశ్వరా! |
57 |
| చ. |
ఒఱపగుమీ విహారతతు లుప్పనబట్టెలు బిల్లటీపు ల చ్చెరువుగ బల్లకోటులు ప్రసిద్ధిగ నయ్యలమేలుమంగకున్ మెఱుపులు ముచ్చటల్ రతులమ్రొక్కులుఁ దక్కులు వచ్చి వచ్చి మీ చిఱునగవుం బ్రమోదములు చెక్కులనొక్కులు వేంకటేశ్వరా! |
58 |
| ఉ. |
చక్కెర బొమ్మ చెక్కులనె సానలు పట్టిన పువ్వుటమ్ములో గ్రుక్కినజవ్వనంబు పెనుగుబ్బలో శ్రీయలమేలుమంగ నీ వక్కునఁ జేర్చి పట్ట సకలాధిప సౌఖ్యము నీకు నబ్బెఁగా కెక్కువ లంటు కందువల యింపుల సొంపుల వేంకటేశ్వరా! |
59 |
| చ. |
పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ స్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ వరవనితాశిరోమణి నవారణఁ గొల్తురు వేంకటేశ్వరా! |
60 |