| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| చ. |
వెలయ వసంతవేళ వనవీథుల సంపగిపువ్వుటిండ్లలో నలరుచుఁ బుష్పవృష్టి నలపార్చుచు నీ వలమేలుమంగతో నలరఁగ నేఁగి వచ్చి యలపారఁగఁ గస్తురినీట మజ్జనం బెలమి వహించి గంధతతు లన్నియుఁ గ్రమ్మఱ మజ్జనంబు పెం పొలయఁగ నాడు తీర్థముల నుబ్బు పయోధులు వేంకటేశ్వరా! |
41 |
| చ. |
వెలయఁగ వేంకటాచలమువీథులఁ గమ్మనిపుష్పవృష్టి కిం పలరఁగ నేఁగి వచ్చి యలపారఁగ నయ్యల మేలుమంగతో నలరఁగఁ గోరకమ్ముల లతాంగన లిమ్ముల సేసఁ జల్లఁగాఁ గలకల నవ్వు మిమ్ముఁ గలకంఠశుకావళి వేంకటేశ్వరా! |
42 |
| ఉ. |
ఎక్కడి కేఁగి వచ్చితి రమేశ్వర నీతనుదివ్యగంధ మే చక్కనియింతిమేని దని సారెకు నీయలమేలుమంగ నీ చెక్కు గళంబు గోళ్లవడిఁ జేర్చుచు నీయలపార్చి వేఁడుటల్ మక్కువగల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా! |
43 |
| ఉ. |
... ... ... ... లును బబ్బిలికాయలు పైఁడిమట్టియల్ మోద మెలర్ప నందియలు మ్రోయఁగనయ్యలమేలుమంగ క త్యాదరలీలఁబాడ బలువంచును వేదము ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ను వేంకటేశ్వరా! |
44 |
| ఉ. |
కాంచనరత్న నూత్న కటకంబులు సందులదండలు\న్ బ్రభల్ ముంచిన మేఖలావళులు మ్రోయగ నయ్యలమేలుమంగ నే త్రాంచలగర్వవీక్షణ సుహాసముతో నినుఁ గోరి భ్రూలతన్ వంచినఁ దియ్యవిల్లు కడవంచు మరుండును వేంకటేశ్వరా! |
45 |
| ఉ. |
ఒప్పగు తూఁగుటుయ్యెలల నూఁగుచు నీ వలమేలుమంగతో నప్పుడు కౌఁగిట న్రతుల నాఁకటిపెల్లున నప్పళించుచున్ ఱెప్పలనవ్వుతో మనసుఱిచ్చలతో నఱగన్నులార్చుచున్ దెప్పలఁదేలు సౌఖ్య మిదె దేవరహస్యము వేంకటేశ్వరా! |
46 |
| ఉ. |
గీసినగోళ్లచేఁ బసిఁడి కిన్నరకంపితముల్ కదల్చుచున్ రాసెడిగుబ్బచన్నులభరంబున నయ్యలమేలుమంగతో మూసియు మూయ కక్షు లరమోడ్చుచు ఱెప్పలఁ దేలఁజే యఁగా నాసల నీవు తన్మయము నందుట చిత్రము వేంకటేశ్వరా! |
47 |
| చ. |
దొరలిన మేనిగందపొడిధూళి వసంతము ఘర్మవారిపైఁ జఱచినపువ్వుఁదేనెల వసంతము నీ కలమేలుమంగకున్ నెఱసి కరంగు చిత్తముల నీళ్లవసంతము మీకు మీకు నీ యొఱపులు నీప్రియంబులు మహోన్నతు లెట్టివో వేంకటేశ్వరా! |
48 |
| ఉ. |
చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికిఁ బుష్పవల్లికిం జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్ జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుఁదీగ లా క్రిక్కిరిగుబ్బలే పసిఁడికిన్నరకాయలు వేంకటేశ్వరా! |
49 |
| చ. |
అరిసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండిగల్ వడల్ బురుడలు పాలమండిగ లపూపముల య్యలమేలుమంగ నీ కరుదుగ విందువెట్టు పరమాన్నచయంబులు సూపకోటియు\న్ నిరతి వినిర్మలాన్నములు నేతులసోనలు వేంకటేశ్వరా! |
50 |