| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| ఉ. |
నాఁడలమేలుమంగ జననంబుకై కలశాబ్ధిఁద్రచ్చియీ మూఁడుజగంబులందును బ్రమోదము నించితి వట్ల నుండుచో నాఁడుఁదనంపుబృంద ముదయంబును బొందఁగ నిత్యసంపదల్ నేఁ డిఁక నేమిటం గడమ నీకృప వారికి వేంకటేశ్వరా! |
81 |
| ఉ. |
ఈతరుణీమణీ విభునియిచ్చకుఁ జాలుతలంప నీయనా యీతని మోహినీగజము యీవని కాయలమేలుమంగ నేఁ డీతనువల్లి చక్కఁదనము ... ... ... ... చెలువంబు చాలదా యీ తెలిమిం చటంచు నుతియింతురు నీసతి వేంకటేశ్వరా! |
82 |
| చ. |
మణుల వెలుంగు దీపవనమాలికలై పొగడొందఁ గంకణ క్వణనము మేఖలావళులఘంటలు శ్రీయలమేలుమంగకు\న్ బ్రణయవినోద సంపదకుఁ బాయక నీ కొనరించుపూజకై ప్రణుతనుతప్రభావముల భాగ్యము లైనవి వేంకటేశ్వరా! |
83 |
| చ. |
కదిసిన సేసము తైముల కంఠసరుల్ ఘనరత్న కంకణాం గదరశనా ... ... నికాయము శ్రీయలమేలుమంగకు\న్ బొదివి వివాహవేళ దిగఁ బోసిన ముత్తెపుఁ బ్రాల నందమై ముదమగు నీకుఁ గన్నుఁగవ ముందఱ నెప్పుడు వేంకటేశ్వరా! |
84 |
| చ. |
నిగిడి పయోధిఁ ద్రచ్చు నెడ నిర్జరసంఘము నిక్కి చూడఁగా ధగధగ యంచు దిక్కుల నుదగ్రతటిల్లత లుల్లసిల్లఁగాఁ దగ నుదయించి మించిన సుధాప్రతి మీయలమేలుమంగ నీ మగువ యటంచు మెత్తురు సమస్తమునీంద్రులు వేంకటేశ్వరా! |
85 |
| చ. |
నడవకుమమ్మ పాదనలినంబులు గందెడి, మాట బెట్టుగా నొడువకుమమ్మ, చెక్కునును నొక్కులతో నలమేలుమంగ నీ వెడనగ కీమొగంబునకు వెన్నెలలాయె నటంచు నీసతి\న్ బడఁతులు మేలమాడుదురు పల్కుల తేనెల వేంకటేశ్వరా! |
86 |
| ఉ. |
బూతలబండ్లనే వలపుఁబుక్కిట నించితి వాఁడిగోళ్లనే ఘాతలు గాఁగఁ జించితివి కాయముపై నలమేలుమంగ నీ చేతిదె యంచు నీతరుణి చెంతలఁ దట్టపునుంగుఁ గస్తురి\న్ జాతుదు రోలి నీదు పరిచారిక కాంతలు వేంకటేశ్వరా! |
87 |
| ఉ. |
పచ్చల సందిదండలును బాహుపురుల్ మణినూపురంబులు\న్ మచ్చరికంబులుం బసిఁడిమట్టెలమ్రోతలుఁ బెల్లు మ్రోయఁగా నెచ్చెలు లోలిఁ గొల్వఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నీ ముచ్చట దీర్చు నొక్కపరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా! |
88 |
| ఉ. |
ఏచిన పాతకంబులకు నిన్నిటికి న్నిరవైనవాఁడ నేఁ గాచినకష్టవృత్తి కరిగాఁపనె యోయలమేలుమంగ నీ చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగన\న్ బూచిన వాక్ప్రసూనములఁ బూజలు సేసెద వేంకటేశ్వరా! |
89 |
| ఉ. |
యోగ్యతలేనికష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁ జూడ గర్భని ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాప్తుఁడ నోయలమేలుమంగ నా భాగ్యము నీగృపాకరుణఁ బ్రాప్యము కావుమటంచు సారెనీ భాగ్యవతీ శిరోమణినిఁ బ్రస్తుతిసేసెద వేంకటేశ్వరా! |
90 |