| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| చ. |
సరసిజసంభవాది దివిజప్రకరంబులసంపదల్ సువి స్తరములు గాఁగఁ గన్గొనలఁ జల్లెడు శ్రీయలమేలుమంగ నీ తరుణీయురంబునం జెలఁగఁ దన్మయ మందెడు నీకు బ్రాఁతియే పరమపద ప్రభుత్వము నపారమహత్త్వము వేంకటేశ్వరా! |
11 |
| చ. |
తరుణీ! మహానిధానమ! సుధామయకూపసమస్త వైభవా భరణమ! దేవదేవుని కృపామతి! యోయలమేలుమంగ! నీ కరుణయ చాలు లోకములఁ గావఁగ నంచు మునీంద్రులున్ సురల్ నిరతి నుతించి మ్రొక్కుదురు నీ ప్రియకాంతను వేంకటేశ్వరా! |
12 |
| చ. |
చెదరిన చిన్ని లేఁగురులు చెక్కున జాఱఁగ ముద్దుమోముతో వదలినకొప్పుతోడ నిడువాలిక కన్నులు నిగ్గు దేఱఁగా నుదుటున నిన్నుఁగూడి మహిమోన్నతితో నలమేలుమంగ నీ యెదుట మనోజసంపదల నేగతి నుండెనొ వేంకటేశ్వరా! |
13 |
| చ. |
తొలకరించు తొయ్యలి వధూమణి చక్కనితల్లి మానినీ తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్ పలుకఁగ నిన్నుఁ జూచి నగుఁ బైకొని నీసతి వేంకటేశ్వరా! |
14 |
| చ. |
తలఁచుఁ గరంగు మైమఱచుఁ దన్మయ మందును జిత్తజాగ్ని ని న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ వలిగిననంతనే కడుఁ బ్రియంబిఁక నేమని చెప్ప నేఁడువో కలిగినప్రేమ మింతయుఁ బ్రకాశము తోఁచెడు వేంకటేశ్వరా! |
15 |
| ఉ. |
నించిన పంచదారలును నేతుఁలు దేనెలు గమ్మ గాఁగఁ దా లించినకూరలున్ బరిమళించగ నయ్యలమేలుమంగ వ డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్పఁగ నారగింతు నీ మించిన వేయుచేతులును మేలములాడుచు వేంకటేశ్వరా! |
16 |
| ఉ. |
అతఁడె నీవు, నీ వనఁగ నాతఁడు, నీ పలుకే తలంపఁగా నాతనిపల్కు నీ హృదయ మాతఁడె పో యలమేలుమంగ నీ చేతిదె సర్వజంతువుల జీవన మంతయు నంచు సన్ముని వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా! |
17 |
| ఉ. |
లోలవిలోలనేత్రకుఁ దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్ మేలిమిఁ జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్ నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా! |
18 |
| ఉ. |
పక్ష్మలనేత్ర! యోచిలుకుపల్కులకల్కి! సరోజవల్లి! యో లక్ష్మి! లతాంగి! యోబహుకళావతి! యోయలమేలుమంగ! నీ సూక్ష్మవివేకలీలలకుఁ జొక్కితి నంచు నఖేందువల్లికా లక్ష్మివికాసత\న్ సతిఁ జెలంగఁగఁజేతువు వేంకటేశ్వరా! |
19 |
| చ. |
లలితపుఁగంకణాంగదకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం బులు మణినీల కాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు బ్బల పెనువ్రేఁగుతోఁ దుఱుముభారముతో నినుఁ జేరవచ్చు నం దెలు మొలనూలు ఘంటలుఁ బ్రతిధ్వను లీనఁగ వేంకటేశ్వరా! |
20 |