శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. చెడుగుల్‌ కొందఱు కూడి చేయఁగఁ బనుల్‌ చీకట్లు దూఱంగఁ బా
ల్పడితింగాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచినఁజూరువట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁగో
రెడి యర్థంబులు నాకు వే గలుగవో శ్రీకాళహస్తీశ్వరా!
101
మ. భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్‌ తపో
వ్యసనుల్‌ సాధితపంచవర్ణరసనుల్‌ వైరాగ్యవంతుల్‌ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్‌ తుదనెవ్వరైనఁ గొలుతున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
102
మ. జలజశ్రీగల మంచినీళ్ళు గలవా చట్రాతిలో బాపురే!
వెలివాడన్మఱి బాఁపనిల్లు గలదా వేసాలు గాకక్కటా!
నలి నారెండుగుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!
103
మ. గడియల్‌ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
కడనేఁడాదికొ యెన్నడో యెఱుఁగ మీ కాయంబు లీ భూమిపైఁ
బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్‌
చెడుగుల్‌ నీ పదభక్తిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!
104
మ. క్షితిలో దొడ్డతురంగసామజములే చిత్రమ్ము లాందోళికా
తతులే లెక్క విలాసినీజన సువస్త్రవ్రాత భూషాకలా
ప తనూజాదికమేమి దుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!
105
మ. సలిలమ్మున్జుళుకప్రమాణ మొక పుష్పమ్మున్భవన్మౌళి ని
శ్చల భక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్సేయఁగా ధన్యుఁడౌ
నిల గంగానదిఁ జంద్రఖండమును దా నిందుం దుదింగాంచు నీ
చెలువంబంతయు నీ మహత్త్వమిదిగా శ్రీకాళహస్తీశ్వరా!
106
మ. తమ నేత్రద్యుతిఁ దామెచూడ సుఖమై తాదాత్మ్యమున్గూర్పఁగా
విమలమ్ము ల్కమలాభము ల్జితలసద్విత్యుల్లతాలాస్యముల్‌
సుమనోబాణజయప్రదమ్ములనుచు న్జూచున్‌ జనంబూని హా
రిమృగాక్షీనివహమ్ము కన్నుఁగవలన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
107
మ. పటవద్రజ్జుభుజంగవద్రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవ చ్చంద్రశిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
క్పటిమల్నేర్తురు చిత్సుఖంబనుభవింపన్‌ లేక దుర్మేధసుల్‌
చిటుకన్నం దలపోయఁజూతురధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
108
మ. నిను నిందించిన దక్షుపైఁ దెగవో వాణీనాథు శాసింపవో
చనునా నీ పదపద్మ సేవకులఁ దుచ్ఛంబాడు దుర్మార్గునిం\న్‌
బెనుపన్నీకును నీదు భక్తతతికిన్‌ భేదంబు గానంగ వ
చ్చెనో లేకుండిన నూఱకుండఁగలవా శ్రీకాళహస్తీశ్వరా!
109
మ. కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీ
శ్వరునిన్‌ గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లాఱెనో
పరనిందాపరుల న్వధింపవిదియున్‌ భావ్యంబె వారేమి చే
సిరి నీకున్బరమోపకార మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
110
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )