శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. ద్వారద్వారములందుఁ గంచుకిజన వ్రాతంబు దండంబులన్‌
దోరంతస్స్థలి బగ్గనంబొడుచుచున్‌ దుర్భాషలాడన్మఱిన్‌
వారింబ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల
క్ష్మీ రాజ్యంబునుగోరి నీ పరిజనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
91
శా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండం గుహల్గల్గవో
చీరానీకము వీథులందొరకదో శీతామృత స్వచ్ఛవాః
పూరంబేఱులఁబాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
చేరంబోవుదురేల రాజుల జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
92
మ. దయ సేయుండని గొందఱాడుదురు నిత్యంబున్నినుంగొల్చుచున్‌
నియమంబెంతొ ఫలంబునంతియగదా నీవీయ పిండెంతొ యం
తియకా యెప్పటికిం దళం బశనబుద్ధిం జూడనేలబ్బు స
త్క్రియలన్నిన్ను భజింప కిష్టసుఖముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
93
శా. ఆరావంబుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా
కారోకారమకార యుక్తమగునోంకారాభిధానంబు చె
న్నారు న్విశ్వమనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ
శ్రీ రంజిల్లఁగడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా!
94
శా. నీ భక్తుల్పదివేల భంగుల నినున్సేవింపుచున్‌ వేఁడఁగా
లోభంబేఁటికి వారి కోర్కులు కృపాళుత్వంబుఁనం దీర్పరా
దా భవ్యంబు దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా!
95
మ. మొదలన్భక్తులకిచ్చినాఁడవు గదా మోక్షంబు నేఁడేమయా
ముదియంగా ముదియంగఁబుట్టె ఘనమౌ మోహంబు లోభంబున
న్నది సత్యంబు కృపందలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్మొఱవెట్టఁగా గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
96
శా. కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణక్రియా
లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రాహార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
97
మ. పదివేలైనను లోకకంటకులచేఁ బ్రాపించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యముగాదు సర్వమునకున్‌ మధ్యస్థుఁడై సత్యదా
న దయాదుల్గల రాజు నా కొసఁగు మెన్నన్వాని నీయట్ల చూ
చి దినంబున్ముద మొందుదుం గడపటన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
98
శా. తాతల్‌ తల్లియుఁ దండ్రియున్‌ మఱియు బెద్దల్చావగాఁ జూడరో
భీతింబొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాము బిడ్డల్హిత
వ్రాతంబున్బలవింప జంతువులకు న్వాలాయమై యుండఁగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీకాళహస్తీశ్వరా!
99
శా. జాతుల్సెప్పుట సేవసేయుట మృషల్‌ సంధించు టన్యాయవి
ఖ్యాతింబొందుట కొండెకాడవుట హింసారంభకుండౌట మి
థ్యాతాత్పర్యము లాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తానెన్నియుగంబు లుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )