శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. వీడెంబబ్బినయప్పుడుం దమ నుతుల్విన్నప్పుడుం బొట్టలోఁ
గూడున్నప్పుడు శ్రీవిలాసములుపైకొన్నప్పుడుం గాయకుల్‌
పాడంగా వినునప్పుడు\న్‌ జెలగు దంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!
11
మ. నినుసేవింపఁగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముఁడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్‌ గుందింపనీ, మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా!
12
శా. ఏ వేదంబుఁ బఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచెఁ దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి, చెంచే మంత్రమూహించె, బో
ధావిర్భావనిధానముల్‌ చదువులయ్యా! కావు! మీపాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
13
శా. కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు వక్షోజముల్‌
రాయన్‌ రాపడెఱొమ్ము మన్మథ విహారక్లేశ విభ్రాంతిచే
బ్రాయంబాయెను బట్టగట్టెఁ దల చెప్ప\న్‌రోఁత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!
14
శా. నిన్నే రూపముగా భజింతుమదిలో, నీరూపుమోఁకాలొ, స్త్రీ
చన్నో, కుంచమొ, మేఁకపెంట్రికయొ, యీసందేహముల్మాన్పి నా
కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాఁజూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా!
15
మ. నిను నావాఁకిలి గావుమంటినొ? మరున్నీలాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో
నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ జే
సిన నావిన్నపమేల గైకొనవయా! శ్రీకాళహస్తీశ్వరా!
16
శా. ఱాలన్‌ ఱువ్వఁగ జేతులాడవు కుమారా! రమ్మురమ్మంచునేఁ,
జాలన్‌ జంపఁగ నేత్రముల్దివియఁగా శక్తుండనేఁగాను, నా
శీలంబేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నాభాగ్యమో
శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా శ్రీకాళహస్తీశ్వరా!
17
శా. రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!
18
శా. నీరూపంబు దలంపగాఁ దుదమొదల్‌ నేఁగాన నీవైననున్‌
రారా! రమ్మనియంచుఁ జెప్పవు వృథారంభంబు లింకేటికిన్‌
నీరన్ముంపుము, పాలముంపుమిఁక నిన్నేనమ్మినాఁడంజుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!
19
శా. నీకున్మాంసము వాంఛయేని కఱవా? నీచేతలేడుండఁగాఁ
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండఁగా
బాకం బొప్ప ఘటించి చేతి పునుకన్భక్షింప కా బోయచేఁ
జేకొంటెంగిలి మాంసమిట్లుదగునా? శ్రీకాళహస్తీశ్వరా!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )