శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. రాజై దుష్కృతిజెందెఁ జందురుఁడు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁగాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁడామాటనే
యాజింగూలె సమస్త బంధువులతో నా రాజశబ్దంబు చీ,
చీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీకాళహస్తీశ్వరా!
21
శా. రాజర్థాతురుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నాజాతి క్రియలేర్పడున్‌ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతి నీభక్తుల్‌ భవత్పాదనీ
రేజంబుల్‌ భజియింతురే తెఱఁగునన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
22
మ. తరఁగల్‌ పిప్పల పత్త్రముల్‌ మెఱుఁగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌,
కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోత కీట ప్రభల్‌
సురవీథీ లిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌
సిరులందేల మదాంధులౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
23
శా. నిన్ను న్నమ్మినరీతినమ్మనొరులన్‌, నీకన్న నాకెన్నలే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాఁటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీకాళహస్తీశ్వరా!
24
శా. నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని
క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా
శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ
జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
25
శా. నీపేరున్‌ భవదంఘ్రితీర్థము భవన్నిష్ఠ్యూత తాంబూలముల్‌
నీ పళ్ళెంబు ప్రసాదముంగొనికదా నే బిడ్డఁడైనాఁడ న
న్నీ పాటిం గరుణింపు మోపనిఁక నేనెవ్వారికిం బిడ్డఁగాన్‌
జేపట్టందగుఁ బట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా!
26
శా. "అమ్మా! యయ్య!" యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే
సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియు దండ్రియున్‌ గురుఁడు నీవేకాన సంసారపుం
జిమ్మంజీకటిఁగప్పిన\న్‌ గడుపు నన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
27
మ. కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై
కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌
వడసెం బుత్త్రులులేని యా శుకునకున్‌ బాటిల్లెనే దుర్గతుల్‌
చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
28
మ. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముంబేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే
దహనుం గప్పఁగఁజాలునే శలభసంతానంబు నీ సేవఁజే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
29
మ. అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )