శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. దురము న్దుర్గము రాయబారము మఱిన్‌ దొంగర్కమున్‌ వైద్యమున్‌
నరనాథాశ్రయమోడ బేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్‌
అరయన్‌ దొడ్డఫలంబుగల్గునదిగాకా కార్యమే తప్పినన్‌
సిరియుంబోవును బ్రాణహానియు నగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
111
మ. తనయుం గాంచి ధనంబు వాడి దివిజస్థానంబు గట్టించి వి
ప్రున కుద్వాహముఁ జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
ర్పునఁ ద్రవ్వించి వనంబు బెట్టి మననీ పోలేఁడు నీ సేవజే
సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
112
మ. క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చెన్‌ మిమ్ములంజూడఁగా
నతఁడే మేటి కవిత్వ వైఖరిని? సద్యఃకావ్యనిర్మాత త
త్ప్రతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతఁడైనన్‌ మముం
గ్రితమే చూచెను బొమ్మటంచురథముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
113
శా. నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనంచు మీఁదెత్తితిన్‌
జేకొంటిన్‌ బిరుదంబు కంకణము ముంజేగట్టితిం బట్టితిన్‌
లోకుల్‌ మెచ్చ వ్రతంబు నా తనువుకీలున్‌ నేర్పులుంగావు ఛీ
ఛీ కాలంబుల రీతి దప్పెడు జుమీ శ్రీకాళహస్తీశ్వరా!
114
శా. నిచ్చల్‌ నిన్ను భజింప చిన్మయమహా నిర్వాణ పీఠంబుపై
రచ్చల్సేయక యార్జవంబు కుజనవ్రాతంబుచేఁగ్రాఁగి భూ
భృచ్చండాలురఁ గొల్చి వారు దను గోపింపన్‌ బుధుండార్తుఁడై
చిచ్చాఱం జమురెల్లఁ జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వరా!
115
శా. దంతంబుల్పడనప్పుడే తనువునన్‌ దార్ఢ్యంబు నున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్‌వలె నీ పదాంబుజములన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
116
శా. ఊరూరన్‌ బవినీని కాండ్లు కవులై యొక్కొక్కచోఁ గొందఱన్‌
కేరే మీరును బాణకాదురనుచున్‌ గీతాలు బోధింపఁగా
సారాసారమెఱుంగలేక మిగులంజౌకయ్యెగా పద్యముల్‌
జేరంజోటికనేది సత్కవులకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
117
శా. దొప్పెండెంగిలి దెచ్చియిచ్చినను గండూషాంబుధారావళిన్‌
దొప్పం దోఁగిన చెప్పుగాల తలపై ద్రొక్కంగ నట్లైనఁ గ
న్నప్పం బాత్రుని జేసితింతటికి సన్మానంబు దీపింపఁగా
చెప్పన్నేరము నీ విహార మహిమల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
118
మ. అల యేకార్ణవ వేళ నీవు వటపత్రాకారమై యుండఁగా
చెలువంబొప్పఁగ మాధవుండు గలిగెన్‌ జేరంగఁజోటంచుదా
నెలమిం దామరతంపరై బ్రతికి నాఁడింతాకు పై నుండియే
సిలుగుల్‌ పొందక నీ కతంబునగదా శ్రీకాళహస్తీశ్వరా!
119
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )