శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. అదమాతంగము లందలంబులు హరుల్మాణిక్యము ల్పల్లకుల్‌,
ముదితల్‌, చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునేఁ
మదిలో వీని నపేక్ష సేసి నృపధామ ద్వారదేశంబుఁగా
చి దినంబుల్‌ వృథపుత్తురజ్ఞులకటా! శ్రీకాళహస్తీశ్వరా!
31
శా. రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్‌
బాసీపాయదు పుత్త్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్‌
కోసీకోయదు నా మనంబకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌
చేసీచేయదు దీనిత్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా!
32
శా. ఎన్నేళ్ళుండితి నేమిగంటినిఁక నే నెవ్వారి రక్షించెదన్‌
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు నెంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం
జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!
33
శా. చావంకాలము చేరువౌటెఱిఁగియుం జాలింపఁగా లేక త
న్నేవైద్యుండు చికిత్సఁబ్రోవగలఁడో? యేమందు రక్షించునో?
యే వేల్పుల్‌కృపఁజూతురో?యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా
జీవచ్ఛ్రాద్ధముఁజేసికొన్న యతియున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
34
మ. దినముంజిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్ర కా
ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
సననిష్ఠన్నినుఁ జూడఁగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సిని మాయానటనల్‌ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా!
35
శా. ఆలంచున్మెడఁగట్టి దానికి నపత్యశ్రేణి గల్పించి త
ద్బాల వ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబుగావించి యా
మాలర్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగా
సీలన్సీల యమర్పినట్లొసంగితో శ్రీకాళహస్తీశ్వరా!
36
మ. తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు, మీ గతుల రెంటన్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే
సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!
37
మ. పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించె న
య్యుదయాస్తాచలసంధినాజ్ఞ నొకఁడాయుష్మంతుఁడై వీరి య
భ్యుదయంబెవ్వరు చెప్పఁగా వినరొ? యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజులమంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
38
శా. రాజన్నంతనెపోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయున్‌
సౌజన్యంబు కృతంబెఱుంగుటయు విశ్వాసంబుగాకున్న దు
ర్బీజ శ్రేష్ఠులుగా గతంబుగలదే శ్రీకాళహస్తీశ్వరా!
39
మ. మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా
రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )