శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. రోసిందేఁటిది రోఁతలేఁటిది మనోరోగస్థుఁడై దేహి తాఁ
బూసిందేఁటిది పూఁతలేఁటివి మదాపూతంబులీ దేహంబుల్‌
మూసిందేఁటిది మూఁతలేఁటివి సదా మూఢత్వమే కాని తాఁ
జేసిందేఁటిది చేఁతలేఁటివి వృథా శ్రీకాళహస్తీశ్వరా!
71
శా. శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో
కాశీవల్లభుఁ గొల్వఁబోదునొ మహాకాళేశుఁ బూజింతునో
నా శీలంబణువైన మేరువనుచున్‌ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వరా!
72
మ. అయవారై చరియింపవచ్చుఁ దనపాదాంభోజ తీర్థంబులన్‌
దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని నర్థప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఁగాని నరులన్నిందించి నిన్నాత్మ ని
ష్క్రియతం గానఁగరాదు పండితులకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
73
శా. మాయాజాండ కరండకోటిఁ బొడిగా మర్దించిరో విక్రమా
జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీమోహముం బాసిరో
యాయుర్దాయ భుజంగమృత్యువు ననాయాసంబునన్‌ గెల్చిరో
శ్రేయోదాయకులౌదు రెట్టులితరుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
74
మ. చవిగాఁజూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాద మొం
ద వినిర్మించెదవేల జంతువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారంబులు సేయనేమిటికి మాయావిద్యచేఁ బ్రొద్దుపు
చ్చి వినోదింపగఁ దీన నేమిఫలమో శ్రీకాళహస్తీశ్వరా!
75
మ. వెనుకంజేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్‌
వెనుకన్ముందటవచ్చు దుర్మరణముల్వీక్షింప భీతయ్యెడున్‌
నను నేఁజూచియు నావిధుల్దలఁచియున్నాకే భయంబయ్యెడుం
జెనకుంజీకటినాయెఁ గాలమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
76
మ. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
గరహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్‌ శంకవో
దరయం గుమ్మడికాయలోను యవగింజంతైన నమ్మించి సు
స్థిరవిజ్ఞానము త్రోవఁ జూపగదవే శ్రీకాళహస్తీశ్వరా!
77
మ. మొదలంజేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
ర్మదులై యిప్పుడు వారధర్మములొనర్పం దమ్ము దైవంబు న
వ్వదె? రానున్న దురాత్ములెల్ల దమ త్రోవంబోవరే యేలచే
సెదరో మీఁదు దలంచి చూడకధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
78
శా. కాసంతైన సుఖంబొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో
దోసంబుల్పెడఁబాపునో వలసినందోడ్తో మిముంజూపునో
ఛీ! సంసారదురాశలేలుడుపవో శ్రీకాళహస్తీశ్వరా!
79
మ. ఒకపూఁటించుక కూడు తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
పక నీడన్వెదకుం జలికింజడిసి కుంపట్లెత్తుకోఁ జూచు వా
నకు నిల్లిల్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )