| శతకములు | శ్రీ కాళహస్తీశ్వర శతకము |
|
| మ. |
పవమానాశన భూషణప్రకరము ల్భద్రేభచర్మంబు నా టవికత్వంబు ప్రియంబులై భుజగశుండాలాటవీచారులన్ భవదుఃఖంబులఁ బాపుటొప్పుఁ చెలఁదిం బాటించి కైవల్యమి చ్చివినోదించుట కేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా! |
41 |
| మ. |
అమరస్త్రీలరమించినంజెడదు మోహంబింతయు\న్, బ్రహ్మప ట్టము సిద్ధించిన నాసదీఱదు నిరూఢక్రోధము\న్ సర్వలో కములన్మ్రింగిన మానదిందుఁగల సౌఖ్యంబొల్ల నీ సేవఁజే సి మహాపాతకవారిరాశిఁగడతు\న్ శ్రీకాళహస్తీశ్వరా! |
42 |
| మ. |
చనువారిం గని యేడ్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁకలేదు నమ్మమని తారావేళ నా రేవునన్ మునుఁగంబోవుచు బాససేయుటసుమీ ముమ్మాటికింజూడఁగాఁ జెనఁటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా! |
43 |
| మ. |
భవదుఃఖంబులు రాజకీటముల నేఁ బ్రార్థించినం బాయునే భవదంఘ్రిస్తుతి చేతఁగాక, విలసద్బాల క్షుథాక్లేశ దు ష్ట విధుల్మానునె? చూడ మేఁకమెడచంటం దల్లి కారుణ్యదృ ష్టి విశేషంబుననిచ్చు చంటబలెనో శ్రీకాళహస్తీశ్వరా! |
44 |
| మ. |
పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నకూపారంబు భూమిస్థలం బవు, శత్రుండతిమిత్రుఁడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికి\న్ శివ! నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా! |
45 |
| శా. |
లేవో కానలఁ గందమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలుర\న్ సేవల్సేయఁగఁ బోదురేలొకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! |
46 |
| మ. |
మును నేఁ బుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందుఁ జే సిన కర్మంబుల ప్రోవులెన్నిగలవో చింతించినం గాన నీ జననంబే యని యున్నవాఁడ నిదియే చాలింపవే నిన్నుఁగొ ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా! |
47 |
| మ. |
తనువెందాఁక ధరిత్రినుండు నను నందాఁక న్మహారోగదీ పన దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుక న్నీపదపద్మముల్దలఁచుచు న్విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబుననుండఁజేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా! |
48 |
| మ. |
మలభూయిష్ఠ మనోజధామము సుషుమ్నాద్వారమో? యారు కుం డలియో? పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో? మోముదా జలజంబో? నిటలంబు చంద్రకళయో, సంగంబు యోగంబొ? గా సిలిసేవింతురు కాంతల\న్ భువి జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! |
49 |
| మ. |
జలకంబుల్, రసముల్, ప్రసూనములు, వాచాబంధముల్, వాద్యము ల్కలశబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తుల్మెఱుం గులు నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చినేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా! |
50 |