| శతకములు | కుప్పుసామి శతకము |
|
|
గొంటరులఁ దుంటరుల గుమిగూర్చి సృష్టిఁ జేసి చీటికి మాటికి డాసి వారు తన్నుకొని చచ్చుచుండంగఁ దనియుచుండు గొప్ప వానికి జేజేలు కుప్పుసామి. |
1 |
|
ఏడొ, పద్నాలుగో, మూఁడొ యెన్నొ, జగము లెల్ల సృష్టించి నటువంటి యీశుఁడొకరొ యిర్వురో, యెందఱో వారి కెల్ల నేటి కోళ్ళ నర్పింతు భక్తితోఁ గుప్పుసామి. |
2 |
|
చిన్న పిల్లలకును దల్లి చెప్పునటులఁ దెలుఁగు మాటల పొంకంబుఁ దీర్చి దిద్ది తెలిసి తెలియక యర్థంబు తెలియునటులఁ జెప్పఁ బూనితిఁ గఱదలు కుప్పుసామి. |
3 |
|
మున్ను పెద్దలు చెప్పిన వెన్నొ కలవు, ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు పేరుగాఁ గ్రుచ్చి మెడలోన వేతువానిఁ గుతిల పడకుండఁ దాల్చుము కుప్పుసామి. |
4 |
|
కమ్మ నెత్తావి దెసలెల్లఁ జిమ్మునట్టి గంధఫలి చెంతఁజేరదు గండు తేఁటి తేనె లేదన్న సంగతిఁ దెలిసికొనుచుఁ దప్ప కీనీతి స్మరియింపు కుప్పుసామి. |
5 |
|
పూలు తెగఁబూసినప్పుడు మూఁగుచుండుఁ దేనెటీఁగలు పైఁబడి తేనెకొఱకు స్నేహితులు కొంద ఱీరీతిఁ జేరుచుందు రప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుసామి. |
6 |
|
పండ్ల చెట్లక్రిందకు నెట్టి బాటసారి యూఱకేరాఁడు ఫలమును గోరివచ్చు వాని నొకకంటఁ గనిపెట్ట వలసియుండు గోల గాకుండ సుంతైనఁ గుప్పుసామి. |
7 |
|
ఒకనియెడఁ గృతఘ్నతఁజూపి యున్న వాని నమ్మియుండుట తగదు లేశమ్ము కూడఁ దనకు లాభంబు కల్గుచోఁ దత్క్షణంబ ముప్పు తప్పక చేకూర్చుఁ గుప్పుసామి. |
8 |
|
ఒక్కమానవుండు డొక్కచీల్చినఁగాని నారికేళఫలము నీరు నీదు గొంటుకాని నిట్లు గోరాడకుండిన నొప్పుకలుగఁనీడు కుప్పుసామి. |
9 |
|
పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు వానినెపుడు నమ్మ వలదు, వలదు మేలుకలుగబోదు మెఱమెచ్చుల కతండు తప్పుచెప్పుచుండుఁ గుప్పుసామి. |
10 |