శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
జీవహింస చేసి జీవింతు ననుకంటెఁ
జెట్టయెందుఁ గూడఁ బుట్టఁబోదు
జీవహింస మాని జీవింపరాదొకో?
కొంత మేలు దానఁ గుప్పుసామి.
61
మాంసము భుజింప నిచ్ఛించి మానవుండు
మ్రొక్కు మ్రొక్కంచు దేవుని ముందుఁబెట్టి
గొంతుగోసి యే మృగమునో కుడుచుచున్నఁ
గోపపడకున్న దేవుండు? కుప్పుసామి.
62
కష్టమైన నేమి కల్ల చెప్పనటంచు
హితుఁడు తప్పకుండ హితముఁజెప్పు
పరుఁడు స్వార్థపరుఁడు మెఱమెచ్చులనుబల్కఁ
గొంకఁ డింతయేని కుప్పుసామి.
63
మాట పరుసదనము మార్తురఁ బుట్టించు
మెత్తదనము కూర్చు మిత్రకోటి
గుడ్లగూబ కేల కొల్లగా నుందురు
తప్పఁ దిట్టువారు? కుప్పుసామి.
64
బుట్టనున్న పాము బుసకొట్టి పోఁబోవు
వీలు చిక్కినపుడు వేగిరించి
సకలభూతములకు స్వాతంత్ర్య కాంక్షయే
యొప్పు సహజముగను కుప్పుసామి.
65
నీటిలోని జీవి నీటిలోఁ జచ్చును
మెట్టనున్న జీవి మెట్టఁజచ్చు
ఘాతుకుండు చచ్చు ఘాతుక కృత్యంబు
లుప్పరించుచుండఁ గుప్పుసామి.
66
ఉప్పతించువాని కుప్పతిల్లదు మేలు
క్రుళ్ళి క్రుళ్ళి చచ్చుఁ గొట్టకొనకు
పరులఁజూచి యోర్చి బ్రదుకువాఁడు శుభంబుఁ
దప్పకుండఁ బొందుఁ గుప్పుసామి.
67
కారణములేక కుజనుండు కష్టపెట్టు
నెట్టివారల నేనియు నెండ్రి యొకటి
చేనిలోనుండి మెల్లగాఁ జేనిపైరు
కొఱికి వైచెడి కైవడిఁ గుప్పుసామి.
68
సానఁ బటినయపుడె వజ్రముల కాంతి
ప్రజ్వలితమగు నా ప్రకారంబె కష్ట
సమయమందె ప్రకాశించు శౌర్యరాశి
గురుతరంబైన శౌర్యంబు కుప్పుసామి.
69
అంత్యనిష్ఠురంబుకన్న నాదినిష్ఠు
రంబు మేలుగావునఁ దత్తరంబు లేక
యున్న దున్నట్టుగాఁ జెప్పుచుందురు బుధ
లొప్పమిని లెక్కపెట్టక కుప్పుసామి.
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )