శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఎన్ని రసములున్న నేమి రుచించును
నుప్పులేని కూర చప్పనగుచుఁ?
కోటిగుణములున్నఁ గొరగావు నీతి యొ
క్కొండు లేకయున్నఁ గుప్పుసామి.
71
తలలు గొఱిగించి కావి బట్టలనుగట్టి
మెడల రుద్రాక్షమాలిక లిడినయంత
ముక్తి వచ్చునే నిస్సంగ బుద్ధిలేక
కుమతి మాటలనేమి కుప్పుసామి.
72
తప్పుఁ దెలిసికొన్నఁ దత్క్షణమే సజ్జ
నుండు దిద్దికొనఁగ నూలుకొనును;
గఱతలాఁడు దానిఁ గప్పిపుచ్చఁ గడంగుఁ
గుటిలబుద్ధిచేతఁ కుప్పుసామి.
73
చచ్చిపోయిన వెంటనే జన్మమెత్తు
జీవి కుడువఁ గర్మమటంచుఁ జెప్పుచుండు
రట్టులైనచోఁ బితృలోక మెట్టువచ్చుఁ?
గుటిలజనసృష్టి గాదొక్కొ కుప్పుసామి.
74
చచ్చిపోయిన వాని కేసరణిఁ జేరఁ
గలవు పిండములు నివాప జలముకూడ
నావులును భోక్తలును దృప్తు లగుటకొఱకుఁ
గూర్చి పెట్టిరిగాకేమి కుప్పుసామి.
75
ముక్కు మొగముఁ జెక్కి మూలవిరాట్టంచు
నొక్క రాయిఁదెచ్చి యుంచి గుడులఁ
గూడు గుడ్డలిచ్చి కొల్తురు ప్రజలెల్లఁ
గొంటెపనులు గావె కుప్పుసామి.
76
మండి వెలుఁగుదాని మన దీపమని చెప్పి
ముద్దు పెట్టుకొన్న మూతిఁగాలు;
మూర్ఖుఁడైన వాని పొందు చేకూర్చును
ముప్పు దప్పకిటులఁ కుప్పుసామి.
77
కొడుకు కొమ్మలనుచుఁ గూడు గుడ్డలనుచు
నిల్లు వాకిలనుచు నెగిరి పడుచుఁ
పాపమనక యెవఁడు వర్తించు వానికిఁ
గొంప మునిఁగితీరు కుప్పుసామి.
78
పొట్టివాని కుండుఁ బుట్టెడు బుద్ధులు
పొట్టివాని నమ్మఁ బోకు మెపుడు
పొట్టివాఁడు గాదె పొడవడంచె బలిని
గూట పథముఁ ద్రొక్కి కుప్పుసామి.
79
రక రకంబులైన రంగు వల్వలు మేనఁ
గట్టినంత రాదు గౌరవంబుఁ
అంగకములఁ గప్ప గంగిరెద్దునకుఁ జాలఁ
గప్పడములు లేవె కుప్పుసామి.
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )