శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కాంచి
బుడిగిబుడిగి నీట మునిఁగి మునిఁగి
మొగమునిండ బూది పూసినమాత్రానఁ
గుదుటఁబడునె మనసు కుప్పుసామి.
21
ఎంతనీతి కలిగి యెపుడు వర్తించిన
నెంత నియతికల్గి యెప్పుడున్నఁ
ద్రాగుబోతు నమ్మరాదు నిజంబుగా
ముప్పువచ్చు దానఁ గుప్పుసామి.
22
రాజు వ్యభిచారి యైనచో రసికుఁడంద్రు
త్రాగి తందనాలాడుచో భోగియంద్రు
పాడిదప్పిన మంత్రాంగ పరుఁడటంద్రు
తప్పు తెలియని లోకులు కుప్పుసామి.
23
కాసులను గూడఁబెట్టిన దాసికొడుకు
పలుకుబడిగల్గి యందందుఁ బ్రాకులాడు;
ధనముతోఁ గాని పనులేవి ధరణిలేవు
మెప్పుకొఱకుఁ జెప్పుటకాదు కుప్పుసామి.
24
గురునిపజ్జ విద్దెల నేర్చి కొనక యదియు
నిదియు మూచూచి మురితోడ నెగిరిపడెడి
చుంబకుని మాటలం జెవిఁ జొన్పఁబోకు
ముప్పువచ్చును దానిచేఁ గుప్పుసామి.
25
నవల చదువు, వ్యాజ్యంబుల కవిలెకట్ట,
యోట్లు, సిగరెట్లు, సినిమాలు, చీట్లు, కాఫి,
నూత్న సప్తవ్యసనములనుచు వచింత్రు
గొప్ప నీతిశాస్త్రవిదులు కుప్పుసామి.
26
ఒదిఁగి పనిపాటు లేవియు నొల్లనట్టి
వాని నెప్పుడు దరిఁజేర్ప వలదు, దాన
నుభయులకుఁ గీడు వాటిల్లు చుండుననుచుఁ
చెప్పుచుందురు పెద్దలు కుప్పుసామి.
27
రఘుకులంబునఁ బుట్టరే రాముకన్న
గొప్పవారు? వారల పేరు లెప్పుడైన
వింటిమే సత్కవికటాక్ష వితతిచేత
గొప్పవాఁడయ్యె రాముండు కుప్పుసామి.
28
ఆయమును మించి యెవ్వండు వ్యయముచేయు
నతనికి సుఖంబు లవలేశ మబ్బఁబోదు
తుదకుఁ గడగండ్ల పాలౌను బ్రదుకుతెఱవు
కూడ లేకుండఁ బోవును గుప్పుసామి.
29
గొంటరికి మంచి చేసిన మంటమండుఁ
గాలియాఱిన సున్నపు రాలమీఁదఁ
జల్లని జలంబు చల్లిన సలసలమని
నిప్పుసెగఁ జిమ్ముకైవడిఁ గుప్పుసామి.
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )