శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
కుష్ఠురోగియైనఁ గుత్సితుండైనను
మగువ తీర్పవలయు మగనికోర్కె
సతికి హక్కులేదె స్వశరీరమును బ్రోచి
కొనఁగ సుంతయైనఁ కుప్పుసామి.
51
చదువు చెప్పకుండ జడురాండ్రఁగాఁ జేసి
స్త్రీలఁ దిట్టిపోయఁ జెల్లుచుండె
దోస మెవరియందు దొరలాడుచుండెనో
చెప్పఁబోవ రెవరు కుప్పుసామి.
52
తీరుబాటు కల్గితిరునాళ్ళకై పోవు
వింతలుండు ననెడి వెఱ్ఱిచేత
భక్తిచేతఁ గాదు ప్రాకృత లోకంబు
తిప్పలైనఁ బొంది కుప్పుసామి.
53
నీచుఁ డెపుడు క్రింద జూచు నైజమగుటఁ
గొండమీఁద నున్న కొలఁదివాఁగు
నేల వైపుఁ జూచు నిలిచియుండక యందు
గొణిఁగికొనుచు నెపుడు కుప్పుసామి.
54
అడచి పాటులేని యనురాగవతి పొందు
మనసుఁ గరఁచఁజాలు మంచి కవిత
పోరులేని యిల్లు పుణ్యాత్ములకుఁగాక
కూడ వన్యులకును గుప్పుసామి.
55
మాతృ భాషయందు మాతృదేశమునందు
మమత లేనివాఁడు మనుజుఁడగునె?
తగని మమతయుండు మృగ పక్షిజాతికిఁ
గూడఁ దెలియలేవె కుప్పుసామి.
56
అత్తవారింట సుఖమెంత యబ్బుచున్నఁ
బుట్టినింటిపైఁ బేరాస పొరయుచుండు
సహజ మాడుబిడ్డకు నిద్ది జగతియందుఁ
గ్రొత్తమాట కాదిది యెందుఁ గుప్పుసామి.
57
వీరుఁ డెప్పుడు రణభూమి వీడిపోఁడు
పాఱుఁ డెప్పుడు రణభూమి పజ్జఁబోడు
మిండఁడెప్పుడు సతిప్రక్కఁ బండఁబోఁడు
కోటి లాభము గల్గినఁ గుప్పుసామి.
58
చిన్ననాఁటనే బిడ్డకుఁ జెప్పకున్న
నీతు లవల సాధ్యముకాదు; మొక్క
యపుడు వదలిపెట్టి యది చెట్టయిన వంకఁ
గూడఁ దీయుటఁ తలమౌనె? కుప్పుసామి.
59
వాజ మాన్పరాదు వసుధాతలంబున
నెట్టివానికైనఁ బట్టుఁబట్టి
యెవరు తీర్పనేర్తు రేటివంకల నెల్లఁ?
చెప్పు చూత మిపుడు కుప్పుసామి.
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )