శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఓరుగాలి విసరి యుయ్యాలలూపంగ
శిరము వంచినట్టి చెట్లు బ్రదుకు
నిక్కి నీల్గుచెట్లు నేలమీఁదను గూలుఁ
గుప్పకూరగాఁగఁ గుప్పుసామి.
31
చదువుకొన్న భార్య సహధర్మచారిణి
యగుటకన్న మంత్రి యగుట కోరు
జగతి మంత్రి గొప్పొ సహధర్మచారిణి
గొప్పొ తెలిసి మెలఁగు కుప్పుసామి.
32
చదువులేని జాయ సల్లాపములకన్నఁ
జదువుకొన్న జాయ చలము మేలు;
వీనువిందుగాఁగ వినవచ్చు నొకమాట
నప్పుడప్పుడైనఁ గుప్పుసాము.
33
అణఁగి మణఁగియుండు నటువంటి కులకాంత
భయము భక్తిగల్గు ప్రియసుతుండు
సంభవించు వాని జన్మంబు నిజముగా
గొప్ప సార్థకంబు కుప్పుసామి.
34
భార్యచదువు పతికిఁ బనికివచ్చుచునుండుఁ
గొడుకు చదువుకన్నఁ గొంతవఱకు
చదువుకొన్న భార్య సంసారమును దిద్ది
కొనుచుఁ బతికిఁగూర్చుఁ గుప్పుసామి.
35
తనదు నీలువుఁ గాపాడు కొనఁగలేని
యతివ భర్త గౌరవముఁ గాపాడఁగలదె?
యట్టి యామెతోఁ గాపుర మహరహంబు
కూర్చుచుండుఁ గష్టంబులఁ గుప్పుసామి.
36
భార్య తనకుఁగాఁ బ్రేమించు భర్త నెపుడు
భర్త తనకుఁగాఁ బ్రేమించు భార్య నెపుడు
స్వార్థమీ ప్రేమయందుఁ గన్పట్టుచుండు
నొప్పిదముగా విచారింపఁ గుప్పుసామి.
37
పాతకుని చేత నెప్పుడు గీతయుండు
మొగముపై వింత వింతఁగఁ బొట్టులుండుఁ
జిన్నెలివియె మనస్సాక్షి సన్నగిలిన
యప్పుడు జనాళి కెందును గుప్పుసామి.
38
ఇంతలోన మాఱి యేయెండ కాగొడ్గు
బట్టువానిఁ జేరఁ బట్టరాదు
సమయ మేగుదేర సంశయింప కతండు
గొంతు నులిమివైచుఁ గుప్పుసామి.
39
పరులు చెప్పు మాటఁ బరికించి చూడక
సమ్మతించువాఁడు జడుఁడు గాఁడె?
వానినమ్మి యెట్టి పనిని జేయఁగరాదు
తప్పకుండఁ జెడును కుప్పుసామి.
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )