శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
కులములోన నొక్క కుజనుండు పుట్టినఁ
గులము జెడును దానఁ గులకలంక
మందువల్ల నెంత మంది నిర్దోషులో
గోడు గుడుచు చుంద్రు కుప్పుసామి.
81
ఎంత మంచివాని నేనియుఁ జిటికలోఁ
జెడ్డవానిఁ గాఁగఁ జేయవచ్చు
బందుకట్టి బైసి వదలుచుఁ బదిమంది
కుచ్చితములు పల్కి కుప్పుసామి.
82
ఆశ కంతంబు లేదెందు నాశ వదల
కున్నఁ బ్రాణికి సౌఖ్యంబు సున్నయగును
దృప్తిఁ గాంచనేరనియట్టి తృష్ణ నరుని
కెప్పుడొప్పుగాఁ బోవదు కుప్పుసామి.
83
చదువు సాములు చెప్పించి సంస్కరింప
కెంతో విత్తంబు గడియించి యిచ్చు తండ్రి
పుత్రునకు నెందు భీషణ శత్రువంచుఁ
జెప్పుదురు పండితోత్తముల్‌ కుప్పుసామి.
84
ఆఁడుదాని యీలు వంతరించిన మీఁద
నెట్టివంశమందుఁ బుట్టియున్న
గ్రుడ్డిగవ్వకైనఁ గొఱగాక పోవు, నీ
యొప్పులేనిఁ జగతిఁ గుప్పుసామి.
85
సంశయించు భర్త సాహచర్యముఁ జేయ
సాధ్యపడునె యెట్టి సాధ్వికైన?
సీత భూమిఁజొచ్చె శ్రీరామచంద్రునిఁ
గూడి యుండలేక కుప్పుసామి.
86
పెండ్లియందు నొక్కరికేల పెత్తనంబు?
కష్టసుఖము లందలి పాలి కాపులగుటఁ
బెండ్లికూఁతురు కొమరుండు పెండ్లిఁ జేసి
కొనఁగవలెఁగాని నిజముగాఁ గుప్పుసామి.
87
మ్రొక్కుగల దదిచెల్లింపఁ బోదు మంచు
గొండలెక్కి యేరులు దాఁటి కొట్టకొనకు
జుట్టునిత్తురు దేవుండు క్షోభపడఁడె
కూఁకటుల చిక్కుఁ దెలియక కుప్పుసామి.
88
అక్షమాలఁ గుంభజుఁడు పెండ్లాడె నందు
రక్షమాల పుట్టింటివా రనినయెడల
ముట్టరాదందు రిదియేల చిట్ట? విప్ర
కోటి కిది చెల్లిపోయెఁగా కుప్పుసామి.
89
తిరిపెమెత్తి జీవించెడి దేబెకున్న
యాత్మసంతుష్టి కలదె ధనాఢ్యునకును?
ధనము సంతుష్టి నీదు విద్యాధనంబొ
కూర్చు నాత్మసంతుష్టిని గుప్పుసామి.
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )