| శతకములు | కుప్పుసామి శతకము |
|
|
నీతిలేనివాని నిరసించు జగమెల్ల నీతిశాలి కెపుడు నెగడు లేదు నీతిశాలి నెపుడు నీతియే కాపాడుఁ గుజనుబారినుండి కుప్పుసామి. |
11 |
|
నాలిమ్రుచ్చు నెపుడు నమ్మరా దాతండు కొంపఁదీయగలఁడు; కుదులకుండఁ గొండచిలువ యట్టె గుటుకున దిగమ్రింగుఁ గుతిలపడఁగ జీవి కుప్పుసామి. |
12 |
|
పరుని నీముందుఁ దిట్టెడు వాఁడు నిన్ను నొరుని ముందటఁ దిట్టక యుండఁబోఁడు చనవు రవ్వంత వాని కొసంగరాదు ముప్పువచ్చుఁ దప్పక దానఁ గుప్పుసామి. |
13 |
|
నమ్మకంబున్న లేకున్న నచ్చకున్నఁ బరులమాటకుఁ దలయూఁచు వాఁడు సత్య మాత్మ గౌరవమేలేని యట్టివాఁడు ముప్పుపుట్టు వానిని నమ్మఁ గుప్పుసామి. |
14 |
|
ఒరుల గొప్పతనముఁజూచి యోర్వలేని పురుషుఁ డెందు వేదనఁబడి పొక్కిపొక్కి తెవులులేకయే తెగటారుఁ జివరకతఁడు తప్ప దీమాట వేదంబు కుప్పుసామి. |
15 |
|
వదరి యూరకే ఱంకెలు వైచువాఁడు పట్టుమన నెట్టిపనికైనఁ బనికిరాఁడు వానఁ గురియదు శారద వారిదంబు తప్ప కుఱుముచుండునుగాని కుప్పుసామి. |
16 |
|
అప్పులిడువానితోడను జెప్పులున్న వానితోడను బైనంబుఁ బూనఁదగదు; చింతసేయక పయనంబుఁ జేసిరేని యొప్పమి ఘటిల్లు నద్దానఁ గుప్పుసామి. |
17 |
|
పుటము వెట్టినపుడె పుత్తడి యిత్తడి తెలియఁగలదు వేఱె తెలియరాదు; సిలుఁగులొందునపుడె చెన్నఁటి సుగుణంబు కూడఁ దెలియఁగలరు కుప్పుసామి. |
18 |
|
ఏటినీరుపొడువ నెక్కలి యిసుమెల్ల నీటితోడఁ బోవు నిలువకుండఁ బెద్దవారితోడఁ బిన్నలీరీతిగాఁ దప్ప కేగుచుంద్రు కుప్పుసామి. |
19 |
|
గుడికిఁ దఱచుపోయి గొణుగుచుండెడివాఁడు చెడ్డపాపమేదొ చేసియుండు నదియె వానిఁబట్టి యట్టిట్టు పీడింప గుడికిఁ బోవు నతఁడు కుప్పుసామి. |
20 |