| శతకములు | నారాయణ శతకము |
|
| శా. |
శ్రీరామామణి పాణిపంకజమృదుశ్రీతజ్ఞ పాదాబ్జ శృం గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్తమం దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా పారావారవిహార, నా దురితముల్ భంజింపు నారాయణా! |
1 |
| మ. |
కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్ గడముట్ట న్వినుతింప లేక నిగుడ\న్ గ్రాలంగ నొప్పారు మి మ్మడర\న్ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడ\న్ జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుండ, నారాయణా! |
2 |
| శా. |
నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్ ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్ నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్ వానిన్ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా! |
3 |
| మ. |
నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో నొరుగుల్ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ గుఱుగ ణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెందు, నారాయణా! |
4 |
| మ. |
చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మంబు వీక్షింపఁడే మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా! |
5 |
| మ. |
లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లం న్మించెఁ బో నీకథా వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్ పెలుచం బూనిన యక్కరాటము తుదిన్ బేతేకరాటంబె పో చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా! |
6 |
| మ. |
మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై యెనయ\న్ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు, నారాయణా! |
7 |
| శా. |
నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా! |
8 |
| శా. |
బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ భవ్యాధినాథుండవై బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకు\న్ భావింప రాకున్న నా జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా! |
9 |
| మ. |
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా! |
10 |