| శతకములు | నారాయణ శతకము |
|
| శా. |
విందుల్ విందు లటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ డందెల్ మ్రోయఁగ ముద్దుమోమలర ని న్నాలింగితుం జేయుచో డెందంబుల్ దనివార రాగరసవీటీలీలల\న్ దేల్చు మీ మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా! |
41 |
| శా. |
విందు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొ మ్మయ్యయో నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁబో వేమి మా మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మి మ్మెత్తుకో చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా! |
42 |
| శా. |
అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్ గన్నుల్ మూయ యశోదకున్ జిఱుత వై కన్పింతు, నారాయణా! |
43 |
| శా. |
ఉల్లోలంబులుగాఁ గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా! |
44 |
| మ. |
కసవొప్పన్ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్ పసిఁ గొంచున్ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా! |
45 |
| శా. |
చన్నుల్ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా! |
46 |
| మ. |
పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా! |
47 |
| శా. |
కేల\న్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళి\న్ గట్టి క ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ వాలన్ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా! |
48 |
| శా. |
కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయ\న్ సము త్తాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం ధ్రాలిన్ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా! |
49 |
| శా. |
రాణించెన్ గడు నంచు నీసహచరుల్ రాగిల్లి సోలంగ మీ వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్ బయల్ముట్టఁగా ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా! |
50 |