| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం దరయం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్ మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్ ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా! |
71 |
| మ. |
వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబున\న్ సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంసారమాతుఃపయో ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెస\న్ దైత్యారి నారాయణా! |
72 |
| శా. |
వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా వేదవ్యాస పరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁ డంచు మీ పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్ శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా! |
73 |
| మ. |
సుతదారాప్తజనాదివిత్తములపై శూన్యాభిలాషుండు నై యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్ మృతిఁ బొందించి దమంబునన్ శమమునన్ మీఱంగ వర్తించు ని ర్గతసంసారి భవత్కృపం బొరయు నో కంజాక్ష నారాయణా! |
74 |
| మ. |
ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్ భక్తి న్ననుష్ఠింపుచున్ నమర న్నన్న సువర్ణ గో సలిల కన్యా ధారుణి గ్రామ దా నము లామ్నాయ విధోక్తి భూసురులకున్ సన్మార్గుఁ డై యిచ్చువాఁ డమరేంద్రార్చిత వైభవోన్నతుఁ డగు న్నామీఁద నారాయణా! |
75 |
| మ. |
ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీరూపుల\న్ అలర న్నంబు మితంబు లైసరసిలో నంభోరుహంబుల్ దగ\న్ నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా! |
76 |
| మ. |
మదిలో నుత్తమభక్తి పీఠముపయి\న్ మానాథ మీపాదముల్ గదియం జేర్చిన వాని కే నొడయడన్ గా దంచు నత్యున్నతిన్ పదిలుం డై సమవర్తి మృత్యువునకు\న్ బాఠంబుగాఁ బల్కు మీ పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా! |
77 |
| మ. |
కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై యలరారం బరుసంబు సోఁకు నిను మున్ హేమాకృతిస్తోమమై వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా! |
78 |
| మ. |
నిరతానందయోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా! |
79 |
| మ. |
ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై యొనర న్నొప్పెడువారు నీపదరుచి న్నూహించు నారాయణా! |
80 |