| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
కలయ న్వేదములు\న్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ వలనన్ భక్తి విహీనుఁ డైన పిదపన్ వ్యర్థప్రయత్నంబె పో గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యంబు దా ఫలకాలంబున నీచపోవు పగిదిన్ పద్మాక్ష, నారాయణా! |
61 |
| శా. |
స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగు\న్ మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులోనే డ్పగున్ నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా! |
62 |
| మ. |
అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా! |
63 |
| మ. |
తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా! |
64 |
| మ. |
తనువుం జీవుఁడు నేక మైనపిదపన్ ధర్మక్రియారంభుఁ డై యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁ డై తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా! |
65 |
| మ. |
తనకు\న్ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్ ననయంబు న్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్ జనితాహ్లాదముతోడ నీచరణముల్ సద్భక్తి పూజించి ని\న్ గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా! |
66 |
| మ. |
పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబు గా మీఁద మీ చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా! |
67 |
| మ. |
పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబున\న్ పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తి న్ననుష్ఠింపుచుం దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ డరుగున్ భవ్యపదంబు నొందుటకు నై యవ్యక్త నారాయణా! |
68 |
| మ. |
సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యము\న్ పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా నిరతజ్ఞానసుకాంతిదర్పణమున న్నిస్సంగుఁ డై తన్ను దా నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా! |
69 |
| మ. |
పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁ డై నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముండు నై పరమానందనిషేధముల్ సమముగా భావించి వీక్షించు నా పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా! |
70 |